అహం బ్రహ్మాస్మి


(ఇది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి 8.12.2000 న మొదటిసారిగా ప్రసారం అయింది)

ఉపోద్ఘాతం

2000 సంవత్సరం కేవలం ఒక  సహస్రాబ్దికి భరతవాక్యంపలకడమేకాదు, మరొక సహస్రాబ్దిని స్వాగతించి  మానవ విజ్ఞాన చరిత్రలో ఒక నూతన శకానికి నాందీ వాచకం పలుకుతుంది కూడా.  ఒక డైనమైట్, ఒక పరమాణు విఛ్ఛేదం, ఒక ఆంటీబయాటిక్ కనుగొన్న వేళ పరవశించినట్టే, మానవాళి మరొకమారు జన్య్వాక్షర సంకేతాల పట్టిక ( Human Genome ) పొడచూపుతో పరవశించి పులకరించింది.

ఏ శాస్త్ర పరిశోధనా ఫలితాన్నైనా  బహిరంగంగా ఆస్వాదిస్తున్నప్పటికీ, దీని ప్రభావం మున్ముందు సమాజంపై ఏ విధంగా ఉంటుందో, ఈ పరిశోధనలు ఏ విపరీత ఫలితాలకు దారితీస్తాయో అనే జంకు, భయాలు వెంటాడుతూనే ఉంటాయి.  నిండుమనసుతో, విదళితబాహువులతో ఆహ్వానించిన శాస్త్రపరిశోధనలు అరుదైన విషయం.

ఈ నాటికలో రెండు ప్రధాన పాత్రలు మీ ముందు కదలాడతాయి.  ఒకటి ప్రహ్లాద్, రెండవది సాగర్.

ప్రహ్లాద్ మానవుడు సాధించే ప్రతి విజయానికీ వెనుక ప్రేరణ, కారణం భగవఛ్ఛక్తియే అనీ,  అణువు మొదలు బ్రహ్మాండం అంతటా వ్యాపించిన ఆ ప్రాధమిక చైతన్యం అంతా భగవల్లీలే అని నమ్మిన వ్యక్తి.

సాగర్ వైజ్ఞానిక ఆకాశంలో అలుపెరుగని యువ వుహంగం.  ప్రతి సమస్యకూ పరిష్కారం కనుగొన వచ్చనీ, మానవ జీవిత అస్తిత్త్వమంతా మనిషిచేతుల్లో తప్ప ఏ అతీతశక్తి హస్తాల్లోనూ లేదని ప్రగాఢంగా విశ్వసించే జన్యు శాస్త్రవేత్త. ఇతను ప్రహ్లాద్ కొడుకు.
వీరిరువురి వ్యక్తిత్వాలనీ నేపధ్యంగా స్వీకరించి, నేడు శాస్త్రజ్ఞులు కనుగొన్న జన్య్వాక్షర సంకేతాల పట్టిక  కలిగించిన వివిధస్పందనలను స్పృశిస్తూ విజ్ఞానపరమైన  ఇతివృత్తం కాబట్టి సామాన్యశ్రోతను దృష్టిలో పెట్టుకుని కొంత ఊహాచిత్రణతో వ్రాసిన నాటిక.

ఇక తురుఫుముక్క మీచేతిలోనే ఉంది.

                                                       **  **  **

దృశ్యం 1

(సాగర్, అతని సహపరిశోధకురాలు సుమనతో తనగదిలో కంప్యూటరు మీద  సీరియస్ గా పనిచేసుకుంటుంటాడు. బ్యాక్ గ్రౌండ్ లో సాగర్ తండ్రి మంత్రపుష్పం చదువుతూండడం వినిపిస్తూ ఉంటుంది.)

సాగర్:   వండర్ ఫుల్ కంప్యూటర్ సుమనా! వండర్ ఫుల్!  మొత్తానికి మనం ఈ సమస్యని ఒక కొలిక్కి తీసుకురాగలిగేం.

సుమన్: అవును సాగర్! రియల్లీ వెరీ  గుడ్! ఇక మనం తర్వాత స్టెప్ కి వెళదామా?

(ఇంతలో Reminder Alarm మ్రోగుతుంది.

సా:       అరే! ఆ విషయమే మరిచిపోయాం. ఈరోజు ఆ విషయం గురించి ప్రకటన వస్తుందేమో కదా!

సు:       అవును సాగర్! ఈ “రాబిట్ జీన్” సమస్యలో పడి ఆ సంగతే మరిచిపోయాం.

సా:       ఓ కే కంప్యూటర్! TV మోడ్ లోకి మారు.

(Computer  beep…)

సా:       వార్తలు వినిపించు.

కం:       (వాయిస్ కమాండ్ రిపీట్ చేస్తూ)  TV మోడ్ లోకి మారుతున్నాను. ఇక వార్తలు వినండి.

న్యూస్ రీడర్: ప్రముఖ వార్త. ఈరోజు  వాషింగ్టన్ లో, ప్రపంచప్రఖ్యాతులైన అనేకమంది శాస్త్రజ్ఞుల మధ్య, నేషనల్ హ్యూమన్ జెనోం రిసెర్చ్ అధ్యక్షులు డా. ఫ్రాన్సిస్ ఎస్. కాలిన్స్, సెలెరా జెనోమిక్స్ ముఖ్య అధ్యక్షులు క్రెయిగ్ వెంటర్ ల  సమక్షం  లో అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్ ఒక సంపూర్ణ మానవుని సృష్టిచేయగల  “జన్యు లిపి” స్వరూపాన్ని, అంటే, మానవ జన్యు రహస్య సర్వస్వపు పూర్ణ రేఖాచిత్రం యొక్క … ముసాయిదాని ఆవిష్కరించారు.

సు:       ఎక్సలెంట్.

సా:       ఎక్సలెంట్ ఇండీడ్!

న్యూ.రీ.:            లండన్, వాషింగ్టన్ లలో  ఏకకాలంలో  విడుదలైన ఈ పుస్తకం లొ  మానవ శరీరం లోని సుమారు 40 వేలనుండి లక్ష దాకా గల జీన్స్ లో దాగి ఉన్న జీవ రహస్యం, అవి DNA ఆవర్తం లో ఎలా అమరి ఉన్నాయో – అవి ఏయే నిర్దేశాలనిస్తాయో- పొందుపరచబడి ఉంది. ఈ ఆవిష్కరణలో భారతీయ శాస్త్రజ్ఞుల కృషిని కూడా అమెరికా అధ్యక్షులు ప్రశంసించారు.

సు:       Hats Off to our scientists!

సా:       Three cheers to human genius!

న్యూ రీ :            1950 లో DNAయొక్క Helical Structure ని నిర్ధారించినందుకు నోబెల్ పురస్కారాన్ని పొందిన అమెరికన్ శాస్త్రవేత్త  డా. జేమ్స్ వాట్సన్ ఫోనులో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా అన్నారు: ” అది ఒక అనంతమైన సంపద. ఇప్పుడు మన చేతులలో  మానవ జన్యు సర్వస్వం దాగి ఉంది.  మిగతా జీవరాసుల జన్యు సర్వస్వాలు కూడ త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. అచ్చుయంత్రం కనిపెట్టిన తర్వాత జరిగిన  విజ్ఞాన విస్ఫోటనం లాగే, ఇకనుంచీ జరుగబోయే పరిశొధనలు కొత్త ఊపు అందుకుంటాయి. మనకు మనగురించి, మన పరిణామ పరిణతి గురించి మేలైన అవగాహన కలిగే అవకాశం ఉంది”

(ప్రత్యేక వార్తా విశేషాలు సమాప్తం)

సా:       మార్వెలస్ సుమనా! మార్వెలస్!! ఇన్నాళ్ళకి మనకలలు సఫలమయ్యాయి.

సు:       అభినందనలు సాగర్! ఇది నిజంగా మార్వెలస్!  చంద్రమండలం మీద నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ అడుగుపెట్టడం కన్నా గొప్ప సంఘటన. డార్విన్ పరిణామవాదాన్ని మించిన పరిశోధన!

(సాగర్ తండ్రి మంత్రపుష్పం చదువుతూ ప్రవేశం)

ప్రహ్లాద్: ఏమిట్రా మీ అరుపులూ కేకలూనూ? ఆ చేసుకునేదేదో ప్రశాంతంగా చేసుకో రాదూ?  మీ అరుపులకి ఇంటికప్పులెగిరిపోతున్నాయి.

సా:       మరేం ఫర్వాలేదు నాన్నా! ఎగిరిపోనీ! ఈ వేళ అంతటి పర్వ దినం!

ప్ర:        గొప్ప విషయమే కనిపెట్టావు. ఈ వేళ శ్రావణ పౌర్ణమి. పర్వదినం కాక మరేమిటి? అవునూ, నువ్వు జందెం మార్చుకున్నావా లేదా? నీ కోసం ఒక కొత్త జందెం తెచ్చి ఉంచేను.

సా:       అబ్బా! నాన్నా! ఎందుకు ఇంకా ఆ పాత కాలపు చాదస్తాలు? ఎన్నిసార్లు చెప్పేను, నాకా ఛాందసాలు పడవని?  నాకు జందెం లేదు. వేసుకోను కూడా.

ప్ర:        నారాయణ! నారాయణ!! చదవేస్తే ఉన్నమతీ పోయిందట ఎవడికో.  బుధ్ధీ జ్ఞానం లేకపోతే సరి.

సు:       అలా అనకండి సార్! సాగర్ నిజంగా జీనియస్!  రాబిట్స్ మీద, గినీ పిగ్స్ మీద సాగర్ చేసిన జన్యు శాస్త్ర పరిశోధనలు ఫలించాయి.  ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా  విడుదల చేసిన  మానవ జన్యు రహస్య సర్వస్వం లో మన సాగర్ చేసిన పరిశోధన కూడా ఉంది సార్! అందుకే మాకీరోజు ఇంత ఆనందం.  చూస్తూ ఉండండి. ఏదో ఒక రోజు సాగర్ ఎంత గొప్పవాడయిపోతాడో!

ప్ర:        గొప్పవాడయితే ఆనందమే. కానీ, విద్యా వినయేన వర్ధతే అన్నారు పెద్దలు.  ఎంత విద్య ఉన్నా, వినయం ఉంటేనే దానికి శోభ, మనిషికి యశస్సూను.

సు:       సార్! శాస్త్ర పరిశోధనలు  ఎప్పుడూ మన నమ్మకాలను త్రోసిరాజంటూనే ఉంటాయి.  ఈ పూజలూ, పునస్కారాలూ, ఛాందసపు ఆచారాలు తిరస్కరించడం అందులో భాగమే!

ప్ర:        ఇంకా నయం. ఆచారాలూ అలవాట్లూ మాత్రమే తిరస్కరించారు. అసలు దేవుడే లేదనలేదు.

సా:       అవున్నాన్నా! ఆ మాటకొస్తే నాకు దేవుడిమీద నిజంగా నమ్మకం లేదు. భగవంతుడికి ఆపాదింపబడుతున్న శక్తులన్నీ మనిషికి ఏదోరోజు అందుబాటులో ఉంటాయని నా ప్రగాఢ విశ్వాసం.

ప్ర:        నారాయణ! నారాయణ!! దేవుడిని నమ్మవూ? అయితే  ఈ చరాచర సృష్టి అంతా ఎలా జరిగిందో కాస్త వివరంగా చెప్పు? దానికి కారణభూతుడెవరో చెప్పు? నీ కన్నా ముందు ఎందరో మేధావులూ, శాస్త్రవేత్తలూ భగవంతుడిని అంగీకరించారు. ఆ భగవంతుడే లేకపోతే  నువ్వూ లేవు, నేనూ లేను- అసలీ ప్రపంచమే ఉండదు.

సా:       దానికి నే నంగీకరించను. ఈ ప్రకృతి మనం పుట్టకముందునుండే ఉంది. మన తర్వాత కూడా ఉంటుంది. దానికి సృష్టికర్తలేడు. అది స్వయం సిధ్ధం.

ప్ర:        ఓహో! ఈ ప్రకృతి ఎవరూ సృష్టించకుండా పుట్టిందని నమ్ముతావుగాని, దేవుడు స్వయంభువు అంటే మాత్రం నమ్మవు. అతనే సృష్టికర్త అనీ, మన జన్మ జరా మృత్యువులన్నీ ఆయన గీసిన గీతలంటే నమ్మవు.

సా:       ఇక ముందు నుండీ నమ్మవలసిన అవసరం రాదు నాన్నా! త్వరలోనే వాటి నన్నింటినీ  మనిషి శాసించగలడు.

ప్ర:        అదంతా నీ భ్రమ రా. మన ఊహకి అందని ఎన్నో విషయాలు ఆ దేవాది దేవుడి చేతిలో ఉన్నాయి. మాటవరసకి పిల్లలు లేని వారికి సంతానం ఇవ్వగలం రా మనం?

సా:       ముమ్మాటికీ. టెస్ట్ ట్యూబ్ ల ద్వారా పిల్లల్ని పుట్టించడంలేదూ? ఇకపై నుండి జన్యువుల నియంత్రణద్వారా రంగు, రూపు, గుణగణ నిర్ణయాలతోసహా ఆరోగ్యవంతులైన  పిల్లల్ని సృష్టించవచ్చు.

ప్ర:        అయినా ఇప్పటికీ విజ్ఞాన పరిధికి  అందని నిస్సంతులు ఎంతమంది లేరు?

సా:       ఆ సమస్య కూడా  మరి కొద్ది కాలంలోనే పరిష్కారం అయిపోతుంది. అసలు పురుష సంపర్కం లేకుండానే  పిల్లల్ని సృష్టించే రోజులు  రావచ్చు.

ప్ర:        అసాధ్యం. నేన్నమ్మను. ప్రామాణికం గా ఋజువు చెయ్యి.

సా:       అలా అన్నావు. బాగుంది. ఇదిగో ఈ కంప్యూటరు చూసేవా? దీనికి “విశ్వజాలం” కనెక్షన్ ఉంది.  సృష్టిలో ఏమూలనున్న వస్తువునైనా దీనితో చూడగలం.  ఏ వ్యక్తినైనా సంప్రదించగలం.  ఇది చెయ్యలేని పని లేదు.  మనం ఏ భాషలో మాట్లాడినా ఫర్వాలేదు. దాన్ని వాయిస్ కమాండ్ అంటాం. దానికి ఆదేశం ఇస్తే క్షణంలో చేసిపెడుతుంది. మన పూర్వీకులు ఎప్పుడైనా ఇలాంటివి చూశారా?

ప్ర:        ఒరే, యోగ సాధన చేసిన వారికి దివ్య దృష్టి ఉండేది కాదట్రా? సరే గాని, ఈ కంప్యూటరుకీ, నువ్వు చెప్పబోయే దానికీ ఏమిటి సంబంధం?

సా:       వస్తున్నా….  Computer! Back to PC Mode

(నెమ్మదిగా PC Mode లోకి మారుతున్న బీప్ శబ్దం)

హ్యూమన్ జెనోం ప్రాజెక్ట్ ఒకసారి చూపించు.

ఇదిగో నాన్నా! ఈ బొమ్మ చూడండి.   మన శరీరంలో గల లక్షలాది జీవకణాల్లో  ఒకటి. ఇది బాగా పెద్దది చేసి  చూస్తున్నాం. మధ్యలో గుండ్రంగా తిరుగుతోంది చూడండి.  దాన్ని న్యూక్లియస్ అంటారు.  అందులో దారపుపోగులులా ఉన్న  ఆకారాల్ని  గమనించండి. వాటిని క్రోమోజోమ్స్ అంటారు.  వాటిమీద కూచున్న గోళాకారపు  జతల్ని చూస్తున్నారుకదా! వాటినే జీన్స్ అంటారు. నిజానికి  ఈ క్రోమోజోమ్స్ మీద ఉన్న జీన్స్ అమరికే … మనం … మనం ఎందుకయ్యామో నిర్ణయిస్తుంది. ప్రతి వ్యక్తికీ ఒక విలక్షణమైన జన్యు నిర్మాణక్రమం ఉంటుంది.  సిల్కు దారాన్ని రెండుపక్కలా  పేనినట్టు ఉన్న ఈ DNA Helix  మీద నాలుగంటే నాలుగు  ATGC అనబడే నాలుగు న్యూక్లియొటైడ్స్ ఉంటాయి.  వాటి అమరిక క్రమం ఏదైతో ఉందో, అది మనల్నీ,  మనం మనంగా ఎందుకయ్యామో అన్న దాన్నీ నిర్ణయిస్తుంది. అంతే!

ప్ర:        ఆ జన్యువుల పేరుపు ఎవరు నిర్దేశిస్తారు? ఆ నారాయణుడే కదా!

సా:       మనకి ఈ జన్యువుల పేరుపు తెలియనంతకాలం అలానే అనుకున్నాం. కానీ ఇక ఆ అవసరం లేదు. రోగకారకాలయిన జీన్స్ ని గుర్తించి, వాటి జీన్ థెరపీతో మార్చడం ద్వారా రోగాలనుండి విముక్తీ, రూప గుణకారకాలయిన జీన్స్ ని ఏర్చి సమకూర్చి కొత్త తరాన్ని  సృష్టించగలుగుతాం.  ఇకనుండీ మనం విధిరాత మీద, విధాత రాతమీద ఉన్న నమ్మకాలని  మార్చుకో వచ్చు.

ప్ర:        నారాయణ! నారాయణ!! నిజమేనా? సృష్టి రహస్యాన్ని మానవుడు చేజిక్కించుకున్నాడా?  స్వామీ! నీ విధులను మానవాళికే అప్పగించేస్తున్నావా స్వామీ? ఇదంతా కలా! వైష్ణవ మాయా?

(దృశ్యం 1 సమాప్తం)

***   ***   ***

అహం బ్రహ్మాస్మి  దృశ్యం 2

(ప్రహ్లాద్ తన మంచం మీద విశ్రమిస్తూ తనలో తను మాట్లాడుకుంటూంటాడు)

సాగర్ చెప్పినదంతా సాధ్యమా అంటే నా మనసెందుకో  కాదని స్పష్టంగా చెబుతోంది. కానీ, కంప్యూటరు  చూపించిన విషయాలు పరిశీలిస్తుంటే నిజమేనేమోనన్న సందేహం కూడా కలుగుతోంది.  క్లోనింగ్ అనీ, డిజైనర్ బేబీస్ అనీ మాటలు వింటుంటే అసలీ సృష్టి స్వరూపమే మారిపోతుందేమోననిపిస్తోంది.  ఎన్నోవేల ఏళ్ళనుండీ మేధావులూ, శాస్త్రజ్ఞులూ  అందరూ దేవుణ్ణి  నమ్ముతూనే వస్తున్నారే? వాళ్ళంతా తెలివితక్కువ వాళ్ళేనా? అనుశృతంగా వస్తున్న ఈ వేదాలూ, శాస్త్రాలూ కట్టుకథలేనా? మిధ్యేనా? భగవదనుగ్రహంతో నోములు ఫలించినవారి అనుభవాలమాటేమిటి? సృష్టిలో  ప్రతివస్తువుతోనూ కంప్యూటరుకి అనుసంధానం ఉందన్నాడే సాగర్, ఆ కంప్యూటర్ నే  అడిగిచూస్తే? నిద్రముంచుకొస్తోంది. ఆ పని రేపు చూద్దాం.   (అనుకుంటూ కలలోకి జారుకుంటాడు)

ఓహో! కంప్యూటర్ ఇక్కడుందా! ఎలా పనిచేస్తుందో ఈ మాయలమారి మిషన్! ఇక్కడనొక్కి చూద్దాం.  లాభం లేదు… ఇక్కడ నొక్కితే!… ఆ! వెలిగింది

(బీప్…బీప్…)

ప్ర:        కంప్యూటర్! నా సందేహాలు నువ్వు తీర్చగలవా? అంత సమర్థత నీకుందా?

కం:       ( స్వరం చాలా గంభీరంగా ఉంటుంది) మీరు నా శక్తిని  శంకించపనిలేదు.  సృష్టిలోని  ఏ సమస్యనైనా పరిష్కరించగలను. విశ్వంలోని  ప్రతి అణువునీ  గుర్తించగలను. ఆదేశించండి.

ప్ర:        నాకున్న సందేహమల్లా భగవంతుడు, ఆ శ్రీమన్నారాయణుడు  ఉన్నాడా,  లేడా, అని.

కం:       భగవంతుడు- శ్రీమన్నారాయణుడు మనిషా? ఫైలా? డైరెక్టరీనా? ఏ డ్రైవ్ చూడాలి?

ప్ర:        అదే నాకు తెలియనిది.. ఆయన మానవమాత్రుడు కాదు.. పరమాత్మ.

కం:       సరే. కాస్త ఓపిక పట్టండి. (కాసేపు గడిచిన తర్వాత) ఆ పేరుగల  ఫైలు గాని డైరెక్టరీ గాని లేదు. ఇంకేమైనా వివరాలు ఇవ్వగలరా? లేక ఈ సెర్చ్ ఇంతటితో ఆపెయ్యమంటారా?

ప్ర:        సత్యలోకంలో వెదుకు.

కం:       సత్యలోకం… మనం సత్యలోకంలోకి ప్రవేసించాం. ఎక్కడకి పోవాలి ఇక్కడనుండి. భగవంతుడి అడ్రసు చెప్పండి.

ప్ర:        ఆయన పాలకడలిపై ఉంటాడు.

కం:     …పాల కడలి… క్షమించాలి. పాలకడలి అన్నపేరుగల వస్తువుగాని ఫైలుగాని లేవు. కానీ, “మిల్కీ వే” అన్న ఫైలు ఉంది. చూడమని శలవా?

ప్ర:        చూడు చూడు. అదే అయ్యుంటుంది. మన పాలకడలినే వాళ్ళు మిల్కీ వే అంటారేమో!

కం:       మనం ఇప్పుడు “మిల్కీ వే” లో ఉన్నాం.  ఎక్కడవెదకాలి?

ప్ర:        చుట్టలుచుట్టుకుని ఆదిశేషుడు ఉంటాడు- నాగరాజు- వేయి శిరస్సుల ఆదిశేషుడు ఆయన.

కం:       ఆదిశేషుడు… క్షమించాలి… అలాంటి పేరుగల వ్యక్తిగాని,  ఫైలు గాని లేదు.  కాని దూరంగా “డ్రాగన్ (Dragon) అన్న పేరుగల నక్షత్రమండలం ఉంది. అందులో వెదకమని శలవా?

ప్ర:        అదే అయ్యుంటుంది. సందేహం లేదు. మనవాళ్ళు ఆదిశేషుడంటారు. చైనీయులు దాన్నే డ్రాగన్ అని పిలుస్తారు.

కం:       అసలిక్కడ జీవపదార్థం లేద్దు.

ప్ర:        ఆశ్చర్యంగా ఉందే! శ్రీమహావిష్ణువు లేడు! పాలకడలి కంపించదు! ఆదిశేషుడు కనిపించనే లేదు. అంతా శూన్యం… జీవరాహిత్యం. అంటే భగవంతుడు లేడా?

భగవంతుడు లేడనేదే నిజమయి ఉంటుంది… జగత్తుకి అతడే సృష్టికర్త అయితే  ఇంత అరాచకమూ, ఇంత అన్యాయమూ రాజ్యమేలుతుంటాయా? అదే నిజం – దేముడు లేడన్నదే నిర్ధారణ.

ఛ! నేనెంత పాపాత్ముణ్ణి! ఎందుకు నాకీ పాడు ఆలోచనలు ఇలా వస్తున్నాయి. దేవుడు సర్వాంతర్యామి. నిర్గుణుడు. నిరాకారుడు. అందుకే ఈ కంప్యూటరుకికూడ అందలేదు. ఆ నారాయణుడికృపవల్లనే పిల్లవాడెంతో వృధ్ధిలోకి వచ్చేడు. సాగర్ కి బుధ్ధి ఆయన ప్రసాదించినదే… గజేంద్రుడు చిక్కుకున్న అస్తినాస్తి విచికిత్సలో చిక్కుకున్నాను… నా మనస్సెంత చంచలమైనది స్వామీ!

(పోతన భాగవతం నుండి)

“లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్

ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్

నీవే తప్ప ఇతః పరంబెరుగ బన్నింపన్ దగున్ దీనునిన్

రావే ఈశ్వర కావవే వరద సం రక్షించు భద్రాత్మకా!”

స్వామీ! నేను బుధ్ధిహీనుణ్ణి. ధైర్యం సన్నగిలుతోంది స్వామీ!  నీపై విశ్వాసం నన్ను విడిచిపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ సందేహావస్థనుండి నావంటి దీనుణ్ణి, మూర్ఖుణ్ణి నిస్సహాయుణ్ణి నువ్వే రక్షించాలి… నువ్వే రక్షించాలి…

“అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుదాపల….”

(మధ్యలో పద్యం ఆపేసి)

మహప్రభో గుర్తొచ్చింది… నువ్వు- వైకుంఠవాసివి…

కంప్యూటర్! వైకుంఠానికి తీసుకుపో! నారాయణ! నారాయణ!

కం:       మనం వైకుంఠానికి వచ్చేసేం

(అక్కడశ్రీమహావిష్ణువు లీలావినోదియై ఉంటాడు)

లక్ష్మి:    నాధా! తమరు నాపై శీతకన్ను  వేసినట్టున్నది. నేనేమి అపరాధము చేసియుంటిని?

వి:        ప్రియే! ఏల అటులనుచుంటివి?

ల:        ఏమని చెప్పను? రోజు కొక్కసారియైన తమ అనంత నామధేయములలో  ఒకదానిని స్మరించినవారికి తమరు ఈప్సితములనొసగెదరే, నిరంతరము తమ పాదసేవచేయుచున్న నన్ను ఒకపరియైనను విహారార్థమెచటికైనగొనిపోయితిరా?

వి:       (మందహాసము చేయును)

ల:       ఎన్ని యుగములైనది! ముల్లోకములలో జరుగు విశేషములు సయితము నాకు తెలియరాకున్నవి. మన నారద మహర్షి కనిపించి చాలకాలమయినది.  నాధా! నాధా! నాకేమియు తోచకున్నది.

వి:       వ్యాకులము చెందకు దేవీ! లోకములన్నియు సవ్యముగనేయున్నవి.  ప్రత్యేక సమాచార సేకరణకై నేనే నారదుని మర్త్యలోకమునకు బంపితిని. అక్కడకొన్ని చిత్రవిచిత్ర సంఘటనలు జరుగుచున్నవని  సమాచారము వచ్చుచున్నది.

ల:       ఆ! అదియే నాకును చింతకు కారణమైనది. మన తనయుడు బ్రహ్మ మర్త్యలోకము గూర్చి తన ఆవేదన వ్యక్తము చేసినాడు.  అతని సృష్టిని ప్రతిఘటించి గర్భస్రావములుచేయుచూ, అతని నిమిత్తములేకనే ప్రయోగశాలల గర్భధారణ ప్రయోగములు చేయుచున్నారట. తన బ్రహ్మత్వమునకు ప్రమాదము సంభవించుచున్నదని వాపోవుచున్నాడు స్వామీ!

(ఇంతలో బీప్… బీప్… అని ధ్వని వినిపిస్తుంది)

(భయంతో) స్వామీ! ఏమి ఆ వింత ధ్వని?

వి:       కలవర పడకు దేవీ! నా భక్తుడు ప్రహ్లాదుని పిలుపది.

ల:       మాటలు వినిపించుటలేదు?

వి:        మర్త్యలోకమున క్రొత్తగా ఆవిష్కరింపబడిన వస్తువిశేషమిది. దీనీ “సూక్ష్మ సందేశి” అని అందురు. “విశ్వజాలం”తో అనుసంధానంచేయబడుటవలన— సృష్టిలో ఎవరెచ్చటనున్ననూ కనుగొనవచ్చును.

ల:       అహో! ఏమి ఈ విచిత్రము? ఇంతవరకు చెప్పరైతిరి? అదిగాక ప్రహ్లాదుడు మిమ్ములను పిలుచుట ఏమి?  మరియొక హిరణ్యకశిపుడు అవతరించి చరిత్ర పునరావృతమగుటలేదుకదా?

వి:       భీతిల్లకుము దేవీ! అతనిపరితాపమొకమారు ఆలకింతము.

ప్ర:       శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం

విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం ……

(విష్ణు దర్శనం అయినట్టు ధ్వనితరంగం)

వి:       ప్రహ్లాదా!

ప్ర:       ప్రభో! నన్ను కరుణించితివా తండ్రీ! నా ప్రార్థన ఆలకించితివా స్వామీ!

వి:       ప్రహ్లాదా! నీ భక్తికి మెచ్చితిని. నీ మనోవిహ్వలత నేనెరుగుదును. అగ్నిపరీక్షకు నిలిచి, నాపై పూర్ణవిశ్వాసముంచినావు. నీ సందేహనివృత్తిచేయువాడ.  నా మానసపుత్రుడు బ్రహ్మయే  మొదటి జన్యుశాస్త్రవేత్త.  సృష్టిలోని సమస్తచరాచరజీవరాశి జన్యురహస్యలిపి అతనివద్ద నిక్షిప్తము.  జీవము గూర్చి జీవకణాల్లో  తెలుసుకోవలసిన రహస్యాలు ఇంకా చాలా నిక్షిప్తమై ఉన్నాయి. సమయానుకూలంగా నన్ను నేను ప్రకటించుకుని జగదోధ్ధారణచేయువాడ. అంతవరకు నా నామస్మరణచేస్తూ, కర్మపరిపక్వమైన పిదప నా సాన్నిధ్యము చేరగలవు.

ప్ర:       ధన్యుడను తండ్రీ! ధన్యుడను. నన్ను విశ్వాసరాహిత్యం నుండి రక్షించావు. నరకకూపం నుండి కాపాడేవు. ఇవే నా శతసహస్ర నమస్సుమాంజలులు.

వి:       శుభం భూయాత్!

(విష్ణువు అదృశ్యం అయిన ధ్వని)

(దృశ్యం 2 సమాప్తం

ప్రకటనలు

పలచని జీవితం.


!!

నాకు అసహ్యం

ఇదీ ఒక జీవితమే,

ఆరుగోడలమధ్య ఇరుక్కున్న దౌర్భాగ్య జీవితం.

 

ఇది కంప్యూటరుమీద కొన్ని క్షణాలు పని ఆగిపోతే,

తనకుతానుగా ప్రవర్తిల్లే, స్క్రీన్ సేవర్ జీవితమైనా కాదు.

ఊహించడానికే దుర్భరంగా ఉంటుంది.    

ఉసురు లేదు, జీవం లేదు,

సూర్యోదయాలు లేవు, ఏడాదికొక్కసారైనా

ప్రేమలు లేవు, ఆవేశాలు లేవు,

ఇంద్రియ సుఖాలూ, పరిజ్ఞానమూ మృగ్యమే

ఆత్మా లేదు, మోక్షమూ లేదు.

కేవలం అనంత ఊహాజనిత అస్తిత్వం తప్ప మరేం లేదు.  

ఎదురుగా ఎవరుంటే వాళ్ళలా ఒదిగిపోవాలి.

వాళ్ళతోపాటే వస్తూపోతుండాలి,

కేలండరులా గోడమీద వేలాడలేను,

ఆల్బంలో క్షణాన్ని బంధించిన గురుతుగానైనా మిగిలిపోలేను.

నా వంటూ స్మృతులూ ఉండవు.

నా దంటూ చేతనా ఉండదు

ఒకర్ని అనుకరిస్తూ, పరోక్షంగా జీవించడం తప్ప.

 ఆకాశం లాగా, దయ్యం లాగా,

నేను ఉన్నానుకాని లేను;

ఊపిరి పీలుస్తుంటానునాకు ప్రాణం లేదు;

ఏడుస్తుంటానుకానీ నా కన్నీళ్లు మీరు తాకలేరు.  

 

అన్నిటిలోకి విషాదం ఏమిటంటే,

త్రిమితీయ జగత్తులో,

నే నొక్కతెనే ద్విమితీయాన్ని.

.

(అద్దంలో నా ప్రతిబింబానికి అంకితం) 

స్వర వరద


ఏ కమ్మని ఊట

ఆ గొంతుబీజాన్ని తడిపి సేద దీర్చిందో!

గంగా? గోదావరా? కృష్ణా? తుంగభద్రా?

నాలోనూ తీగలు సాగుతోంది ఈ పాట.

నావెర్రిగాని, ఇది నాదా? నాదానిది గాని.


ఎన్ని గొంతులు ఆ తడిలో కలిసిపోయేయో!

ఇంకెన్ని తీర్థాలు తనలో ఇముడ్చుకుందో

ఎన్ని పైరగాలులు … ఎన్ని తూర్పారలు

ఎన్ని ఆర్తనాదాలు— ఎన్ని ఆత్మక్లేశాలు

తనలో నిక్షిప్తం చేసుకుందో!


ఈ కాఫీ… ఏ ప్రేయసి మనో వేదనో

ఈ భాగేశ్వరి ఏ ప్రియుని పలవరింతో

ఈ కళ్యాణి ఏ ముగ్ధవధూ మంజీరనాదమో

ఈ భూపాలమే ఉషస్సులకు మేలుకొలుపో


ఈ స్వరఝరికి ఇన్ని మెరుగులెక్కడివి?

ఈ గళవిపంచికిన్ని పదభంగిమలెక్కడివి?

చిమ్మచీకటితోనూ, చిరుదివ్వెతోనూ పొత్తే

 పెనుతుఫానుతోనూ, పిల్లగాలితోనూ ఊసులే.


ఇది ధ్వనా? తరంగమా? రసప్రవాహమా?

ఒడ్డున ఉండగలిగినవాళ్లనెవరినైనా అడిగిచూడాలి.  

ఇసుకతిప్ప


నది మోసుకొచ్చే ఇసుకలా

ఆవేశంతో మనం మోసుకువచ్చే విశ్వాసాలే

మన ప్రగతికి ప్రతిబంధకాలవుతాయి.

వయసుబిగిలో అవి అవధులుతాకిన ఆనందమిచ్చినా

గ్రీష్మతాపంలాంటి జీవనపోరాటంలో

నమ్మకాల తడి అరిపోతున్నపుడు

విశ్వాసం నీటిపాయలా సన్నగిలిపోతుంది.

అటకమీది రాగి పాత్రకి కిలుం పట్టినట్లు

జీవితానికి ఎరగాని నమ్మకాలకి కూడ

కాలక్రంఅంలో కిలుం పడుతుంది.

అందుకనే సమాజపు ప్రయోగశాలలో

వాటిని నిత్యం పరీక్షించుకుంటూ ఉండాలి.

నూతిలోంచి కవ్వుతీసినట్టు బలిసిపోయిన మూఢనమ్మకాలని

నిర్దాక్షిణ్యంగా తవ్వి అవతల పోసెయ్యాలి.

 

కనీసం మహోన్నతవ్యక్తిత్వాల

వరదస్పర్శ మనల్ని తాకినప్పుడైనా!

కాలబలిమి


చీకటిని మింగిన వెలుతురు

మిన్నూ మన్నూగానక తెగతిరుగుతుంటుంది

వెన్నెముకలా వెనకనేపొంచి ఉన్న నీడ

వాననుడిలా సమయం కోసం నిరీక్షిస్తుంటుంది.

.

వెలుతురును తొక్కిపెట్టిన చీకటి

తన విజయానికి విర్రవీగుతుంటుంది.

కాని మిణుకు మిణుకుమంటూ వెలుతురు

ఆశకు ఊపిరిపోసుకుంటూ సజీవంగా ఉంటుంది.

కలలు


కలలు చాలా పెంకివి… చిన్నపిల్లల్లా…
కథలోని రాజకుమారుడు
అన్ని వీధులూ వదిలి ఏడో వీధికే నడిచినట్టు
ఎప్పుడూ వద్దన్నవైపుకే పరిగెడతాయి…

అలసి మేనువాల్చాలని ఇలా కుర్చీలో చేరబడతానా
మనవరాల్లా ఒళ్ళోవాలి మెడ బిగించి,
ఎలామూస్తాయో గాని, ఇట్టే కళ్ళుమూస్తాయి.

రెండు రెప్పల్నీ రెక్కల్లాజాచి
చెప్పలేనిలోకాలకు తీసుకుపోతాయి.

మయుణ్ణి మించినమాయలాడులు కలలు.
వాటికిలొంగని వాళ్ళూ, భంగపడనివాళ్ళూ ఉండరు.
జీవితపు ఎడారిలో నిరాశాలదాహార్తి తీర్చే ఒయాసిస్సులు
అసాధ్యమైన పనులు సుసాధ్యమయేది ఈ ఎరీనాలోనే.

కలలు అతీంద్రియ గూఢచారులు.
లోలోపలపదిలంగా దాచుకున్న ఆలోచనలని
పసిగట్టి ప్రాణంపోసి దగ్గరకు తీసుకువస్తాయి.
గిజిగాడిని మించిన జిగిబిగితో
మూడుకాలాలనీ ముప్పేటలా అల్లుతాయి.

కలలు అపర విశ్వామిత్రులు. విజ్ఞాన ఖనులు.
‘కేకులే’కు బెంజీన్ నిర్మాణాన్ని చెప్పినా
‘ఆర్కిమిడీస్ ‘ కి బరువుల రహస్యం చెప్పినా చెల్లుతుంది.

తొమ్మిదినెలల సావాసపు తీపి గుర్తేమో

ఏడడుగుల తోడుకంటె, జీవితాంతం సహచరిస్తాయి.
రెప్పలముందు మనతో ఆడుకునే ప్రపంచంకంటే
రెప్పలవెనక మనం ఆడుకుందికో ప్రపంచాన్ని దాస్తాయి.

1.9.2004

అనుభూతులు


అల్లావుద్దీన్ దీపంలోని భూతంలా
ప్రకృతి గాలిపోగుజేసి నన్ను తయారుచేస్తుంది

అనంత నీరవ, నిర్జీవ రోదసిలో ప్రాణం మొలకెత్తినట్టు
ఈ ఎడారి ఎదలో ప్రేమ బుగ్గలా పుట్టి వరదలౌతుంది.

నా కూతురు
నా గుండెను కాగలించుకుని నిద్రిస్తుంటే,
మట్టినై నేనున్నప్పుడు
నామీద పచ్చగడ్డి అల్లుకున్న భావన
ఒక పురానుభవమై కదలాడుతుంది.

ఆమె తోడు వెతుక్కుని
తన గమ్యం వైపు తిరిగినపుడు,
చవిటినేలల్ని కేదారాలుగా మలచడానికి
పరిగెత్తుతున్న పాయను వీడి
బాధపడుతున్న నదినౌతాను

నేను చితిపై మండుతున్నప్పుడు,
నాకోరికను మన్నించిన ప్రకృతి,
విసుగూ, అలుపూ, భయం లేకుండా
విశ్వవీక్షణానికి వేల రెక్కలననుగ్రహించిన
స్మృతి ఆవహిస్తుంది.