రెండు ఫోటోలు

Image Courtesy: http://sms.latestsms.in/wp-content

నా బ్లాగ్మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

ఈ మకర సంక్రాంతి మీ అందరికీ ఆనందోత్సాహాలను అందించడమేగాక మీ జీవితాలని ఉత్తరదిశగా (ఊర్ధ్వదిశ / కుబేరుడి దిశ) తీసుకెళ్లడానికి వలసిన సాధనసంపత్తికి మూలకారణం కావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.

ఇక్కడ రెండు ఫోటోలు ఉంచేను (కవితలు). ఇవి మొదట్లో నా బ్లాగులో ఉంచినవే. అప్పటికింకా నాకు బ్లాగ్మిత్రులు లేరు. సందర్భమూ, వాతావరణాల్లో ఏ మార్పూ లేకపోవడం వలన వాటి అన్వయంలో ఎటువంటి మార్పూ లేకపోవడం, చాలామంది చదివి ఉండరన్న ఉద్దేశ్యంతో ఉంచుతున్నాను.

————————————————————————————————

పాత ఫోటో

 

రాత్రిమాలవేసుకుని అయ్యప్ప దీక్ష తీసుకున్న ఆకాశం

మకర జ్యోతిని దర్శిం చే ఉంటుందిదీక్ష విరమిస్తోంది

భూమిగుడ్డును పొదగడానికి  మంచుకోడి

రాత్రల్లా రెక్కలు జాచుకుని కూర్చుంది

బిలబిల మంటూ బయటకు వచ్చేసిన రంగురంగుల పువ్వు పిల్లలు

తమ ముక్కులకు తుమ్మెదలను కరుచుకుంటున్నాయి.

వాడిపోయిన నక్షత్రాల కసవూడ్చి, చినుకుల కళ్ళాపి జల్లి

ఉషా కన్నియ కొండ గొబ్బెమ్మల మీద ఎర్ర బంతి అమరుస్తోంది

వెలుగు వరద ఆపలేక  ఎవరో

తూరుపు కొండల నడుమ  వరద గేట్లు ఎత్తేసారు.

చెట్లమీద మేల్కొన్న పక్షులు సంధ్యావందనం ప్రారంభించేయి.

మకరందాన్ని ఆచమించిన సారంగాలు, సామవేద పాఠం చేస్తున్నాయి

తంబురాలు నడుచుకుంటూ  బిక్షాటనకు బయలు దేరాయి.

పత్రాంతాలనుండి  బొట్లు బొట్లు రాలుస్తూ

చెట్లు అర్ఘ్య ప్రదానం చేస్తున్నాయి

కావిడి జంగమయ్య శంఖనాదానికి

బద్ధకం విదుల్చుకున్న పిల్లగాలి

ఈల వేసుకుంటూ  పెరట్లోకి తుర్రు మంది

తోటవాసనల ధూపంవేసిన తెమ్మెర

అరిటాకుమీద అమ్మవేసిన పొంగలితో పొత్తుకలిపి

ఆత్మా రాముడికి ప్రాతః నివేదన చేస్తోంది.

.

కొత్త ఫోటో

 

నైట్ వాచ్ మన్  చీకటి  ఆవులించి

ఆకసంమీద నుండి తన దుప్పటి మడత పెడుతోంది.

తూరుపు పర్వతం పేలి వెలుగులావా భూమిని ముంచెత్తుతోంది

కిరణాల ignition key జొప్పించి

జీవవ్యాపారాల “ఇంజన్ “ని  స్టార్ట్  చేస్తున్నాడు సూరీడు.

కలుగుల్లోంచి వస్తున్న ఎలుకల్లా

పాల పేకెట్లకీ,  సిగరెట్లకీ, పరిగెడుతున్నారు జనం.

పేపరు పావురాయి ఎగురుకుంటూ వచ్చి  ముంగిట్లో వాలింది .

ఇనప మొక్కల మధ్య ఉదయాస్తమయాల అందాలెరుగని

మా  బోన్సాయ్ కాగడా మల్లి

కాస్తంత వెలుతురుకే — ముఖం ‘చాటంత’ చేసుకుంది .

ముగ్గు వెయ్యడం తెలియని మా చిన్నమ్మాయి  పరికిణీ ఎగదోసుకుంటూ

బాపు “మల్లె పందిరి ” స్టిక్కరుని  నేలమీద అంటిస్తోంది.

సహజ వనాలెరుగని తుమ్మెదలూ – తేనెటీగలూ

కేలెండర్లతోనూ, కలర్ టీవీలతోనూ  సరిపెట్టుకుంటున్నాయి

శల్యావశిష్ట మైన సంప్రదాయానికి  సంకేతంలా

ముష్టివాడు  ఉదయాన్నే రాగిచెంబుతో  తయారు .

రోజు తీసుకు రావలసిన వస్తువుల అష్టోత్తరంతో

శ్రీమతి చేతికందించిన కాఫీ చుక్కనే

ఆత్మారాముడికి  అవసర నైవేద్యం చేసుకుంటున్నాను  నేను.

4 comments to రెండు ఫోటోలు

  1. Gopala Krishna Rao Pantula అంటున్నారు:

    రెండు కవితలూ చాలా చాలా బాగున్నాయి.ఇట్లాంటివి మరిన్ని రాస్తూండండి.

ప్రత్యుత్తరమిమ్ము

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )