(సాహిత్య విమర్శలు చాలవరకు Polarized గ ఉంటాయి. అంటే విమర్శించేవాళ్ళు తాము కట్టుబడిన సిధ్ధాంతాల దృష్టిలోనే విమర్శించాలనుకుంటారు. తప్పులేదు. కానీ, రచయితకి కూడా తమ ఆదర్శాలూ లక్ష్యాలూ ఆపాదించడం వల్లనో, లేవని విమర్శించడం వల్లనో వస్తుంది తంటా. రచనలు ఎల్లవేళలా సిధ్ధాంతాలప్రాతిపదిక మీద రాయబడనక్కరలేదు. రచన ఒక సృజన ప్రక్రియ (Creative process) కనుక తగిన ప్రేరణ లేకుండా ఇది సాధ్యపడదు, కొందరు వృత్తిరచయితలను (Professional Writers) మినహాయిస్తే. ఆ రచనా ప్రక్రియలో సందర్భం వచ్చినపుడు రచయిత తన భావాలను ప్రతిఫలించడానికి ప్రయత్నిస్తాడు గాని, తన అభిప్రాయాల ప్రకటనలకోసం రచన చెయ్యడు. అలా రాసే రచనల పరమార్థం, దానిని ఉద్దేశించిన పాఠకులూ వేరుగానూ, వారి అవగాహనా పరిథులూ వేరుగానూ ఉండి, అవి రచయితకు సుస్పష్టంగా తెలిసే ఉంటుంది. సాహిత్య విమర్శ ఎప్పుడూ రచన (text)లో చెప్పిన విషయాలకూ, చెప్పకపోయినా పరోక్షంగా సూచించిన విషయాలకూ పరిమితమై ఉండాలి తప్ప, కాకతాళీయంగా తమ అభిప్రాయాలకు అనుగుణంగా ఉంటే ఆకాశానికి ఎత్తేయ్యడం, లేకపోతే దాన్ని పట్టించుకోకపోవడం వంటివి చెయ్యకూడదని నా అభిప్రాయం. కొన్ని రచనలు ఏ వ్యాఖ్యానమూ చెయ్యకుండా ఉన్నది ఉన్నట్టు ప్రకటించడానికి (matter of fact presentation) అయి ఉండొచ్చు. వాటిని అలాగే స్వీకరించి, ఆ పరిధిలోనే విమర్శించాలని నేను భావిస్తాను. ఆ సందర్భంలో నేను చదివిన కథ ఆధారంగా చేసిన చిన్న ప్రయత్నం ఇది.)
* * *
వగర్చుకుంటూ, వగర్చుకుంటూ, మొదటి అంతస్థు 24 మెట్లూ ఎక్కి ఎలాగైతేనేం, నేను మా సమావేశంహాలు చేరుకోగలిగాను. అప్పటికే టేబిలుచుట్టూ స్వామి, రాంబాబు, సోమయాజులుగారూ, లక్ష్మీ, సుబ్రహ్మణ్యం, అంతా ఆసీనులై ఉన్నారు. ప్రతి బుధవారం సాయంత్రం 6 గంటలకి అక్కడ క్రమం తప్పకుండా సమావేశమవుతుంటాం. ఆ వారంలో చదివిన మంచికథగాని, నవలగాని ఉంటే దానిగురించి ఒకరు మిగతావాళ్ళకి చెప్పడం, తర్వాత దానిగురించి చర్చించడం మా అలవాటు. రెండేళ్ళకు పైగా నిర్విఘ్నంగా కొనసాగుతున్న కార్యక్రమం అది. ఇవాళ నా వంతు.
“మీరు ఇవాళ కాంగ్రెసులో చేరిపోయారేమోననుకున్నాను” అన్నాడు రాంబాబు నేను Hand ఇచ్చానేమోనన్న మాట ధ్వనిస్తూ.
“అయాం సారీ. మీ రందరూ నా కోసం ఎదురుచూస్తున్నారని మీరు వదిలిన కేజీడేసి నిట్టూర్పులే చెప్పక చెబుతున్నాయి.
“అసలు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికోసం ఎందుకు నిరీక్షిస్తాడో— ఒక్కొకసారి జీవితకాలం పాటు — తెలుసుకోవడం చాలా కష్టం. ఇవేళ అటువంటి సంఘటనే జరిగింది. నేషనల్ హైవేలో జరిగిన ఒక ప్రమాదం లో నా స్నేహితురాలు బయటపడిందిగాని, ఆమె భర్త చనిపోయాడు. ఆవిడని ఓదార్చి కొన్ని ముఖ్యమైన పనులకు attend అయి వచ్చేసరికి ఆలస్యం అయింది. అందుకు క్షంతవ్యుణ్ణి.”
“అవును. నేను డ్యూటీనుండి వస్తుంటే దారిలో కనిపించింది. ఆ అమ్మాయి భయపడిపోయి స్కూటరు మీదనుండి దూకేసిందట కదా. అందుకని బండి టర్న్ అయిపోయి ఎదురుగుండా వస్తున్న ట్రక్కుని గుద్దేసిందంటున్నారు అంతా” అన్నాడు స్వామి. అతను ఎస్సార్ లో ఎగ్జెక్యూటివ్ గా పనిచేస్తున్నాడు.
“చిత్రమేమిటంటే, తను గత ఆరేళ్ళుగా ఒంటరిగా ఉంటోంది. ఈ ఉదయమే అతను ఆమె ఇంటికి వెళ్ళి తన ప్రవర్తన మార్చుకుంటానని మాట ఇచ్చి, ఇద్దరూ కలిసి అతని ఇంటికి వెళ్తుంటే ఈ ఘోరం జరిగిపోయింది”
“అయితే ఇంతకీ ఈ రోజు నువ్వు చెప్పబోయే కథ ఇదేనా?” నవ్వుతూ అన్నాడు “కథ”ని కొంచెం ఒత్తిపలుకుతూ సోమయాజులు. అతను వ్యవశాయ శాఖలో డిప్యూటీ డైరెక్టరుగా పనిచేస్తున్నాడు. మొక్కలగురించి చెప్పడంలో అతను స్పెషలిస్టు.
“నో. నో. అది ఆలస్యానికి నా సంజాయిషీ మాత్రమే. ఇక పోతే నే చెప్పబోయే కథ ఈ మధ్య “Readers Digest”లో వచ్చింది. కథ టూకీగా చెప్పాలంటే… రాబర్ట్స్ ఒక ప్రైవేటు డిటెక్టివ్. అతని భార్య లీజా. అనుకూలవతి. వాళ్ళిద్దరిదీ 5 సంవత్సరాల వైవాహిక జీవితం. పిల్లలు లేరు. లీజా అతన్ని ప్రేమించి పెళ్ళిచేసుకుంది. కానీ, పెళ్ళయిన మూడుసంవత్సరాలకే వాళ్ళ జీవితంలో అపసృతులు చోటుచేసుకున్నాయి. రాబర్ట్స్ విధినిర్వహణలో అందెవేసిన చెయ్యే కానీ, జీవితాన్నే సరిగా నిర్వహించుకొలేకపోతాడు. లిండా అన్న స్త్రీతో పరిచయం పెరిగిన తర్వాత లీజాను అశ్రధ్ధ చేస్తుంటాడు. లీజా మాత్రం పాపం తన భర్త ఎప్పటికైనా మారక పొతాడా అన్న ఆశతో ఉంటుంది తనకు అతని వ్యవహారం తెలుసన్న విషయం అతనికి తెలియకుండ జాగ్రత్త పడుతూ .
“ఆరోజు సాయంత్రం 6.30 దాకా రాబర్ట్స్ ఇల్లు చేరడు. అతను చాలా అలసిపొయినట్టు కనిపిస్తాడు కూడ. మధ్యాహ్నం భోజనం చేసినట్టు కనిపించడు. లీజా అతన్ని ఆప్యాయంగా పలకరిస్తూ, “భోజనం చేద్దాం రా” అంటుంది, నేనుకూడ భోజనం చెయ్య లేదు, నీకోసం చూస్తున్నాను సుమా అని సూచిస్తూ. కాని అతనవేం పట్టించుకోకుండా, “నాకు ఆకలిగా లేదు. నువ్వు తినెయ్. నీకు ఎన్నాళ్ళనుండో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను…” అని ఎదో చెప్పబోతాడు.
“అతన్నిమధ్యలోనే తృంచేస్తూ, “అన్నీ తర్వాత చెబుదువుగాని, ముందు చెయ్యి కడుక్కుని రా! కనీసం టిఫినయినా చేదువుగాని నాతో” అని ఫ్రిజ్ లోంచి బ్రెడ్, జాం, తీసి, మధ్యాహ్నం బాగా కాల్చి ఉంచిన duck ని దాని రెండుకాళ్ళతో పైకి ఎత్తి “చూడు. ఇది ఎంత చక్కగా ఉందో. నీ కిష్టమని చేసి ఉంచా. ఇది తిని కాస్త rum తాగేవంటే, అలసట పటాపంచలైపోతుంది” అని ఏదో చెప్పబోతుంది.
“అదికాదు లిజ్! నీకు ఎన్నాళ్లనుండో చెప్పాలనుకుంటున్నాను. నేను నీకు విడాకులిచ్చేస్తాను. లిండా నేనూ మేరేజి చేసుకోబోతున్నాం. నీకు నచ్చినవాడితో నువ్వు ఉండొచ్చు,” ఆమె ముఖంలోకి సూటిగాచూడలేక అటుతిరిగి చెబుతాడు కుర్చీలోకూర్చుంటూ. అనుకోని ఈ హఠాత్పరిణామానికి క్షణంసేపు దిగ్భ్రాంతి చెంది, చేతిలో ఉన్న duckని అలాగే అతనిమీదకి విసిరికొడుతుంది పట్టలేని కోపంతో. ప్రమాద వశాత్తూ అది రాబర్ట్స్ కి మెడదగ్గిర ఒక sensitive pointకి తగిలి, అతను స్పృహకోల్పోయి కొద్దిసేపట్లోనే చనిపోతాడు. లిజ్ పరిగెత్తుకెళ్ళి అతనికి ఉపచారాలు చేస్తుంది కానీ అతను చనిపోయాడని తెలుసుకుంటుంది. వెంటనే duck, rum తోబాటు అన్నిటినీ ఫ్రిజ్ లో దాచేసి, ఇంటికి తాళం వేసి, బజారుకివెళ్ళి రాబర్ట్స్ కి ఇష్టమయిన Ice Cream, Jam కొనుక్కువచ్చి, చాల కూల్ అండ్ కంపోజ్డ్ గ చుట్టుపక్కలవారందర్నీ పలకరించి, ఇంటికి రాగానే policeలకి ఫోనుచేస్తుంది. వాళ్ళు రావడం, అన్నీ పరిశీలించడం, లీజాని ప్రశ్నించడం, శవపరీక్షచెయ్యడం, Postmortem report లో మెడదగ్గిర ఒక పదునైన వస్తువుతో కొట్టినట్టూ, అందువల్లనే అతను చనిపొయినట్టు నిర్థారణ చెయ్యడం జరిగిపోతాయి. కానీ ఎంత వెదికినా ఇంట్లో ఆ పదునైన వస్తువేదో దొరకదు. మరునాడు ఆమె ఇంటికి ఇద్దరు డిటెక్టివ్జ్ మరోసారి తణిఖీకి వచ్చినప్పుడు, ముందురోజు వాళ్ళకి ఏ రకమైన మర్యాదలూ చెయ్యలేకపోయాననీ, తనకు మనసు బాగోలేకపోవడం వలన అలాజరిగిందనీ క్షమాపణలు చెప్పి, ఆ duck నీ, bread నీ, rum నీ వాళ్ళకి వడ్డిస్తుంది. ఆ duck ని చెరొక ముక్కా చేసుకుని నములుతూ, అందులో ఒకడు, “మన కళ్ళముందే ఈ రహస్యం దాగి ఉంది. అయినా పోల్చుకోలేకపోతున్నాం” అంటాడు. దానికి రెండోవాడూ “అవును”అని తల పంకిస్తాడు. లొపలిగదిలో లీజా ముసిముసినవ్వులతో కథ ముగుస్తుంది.”
ఆనవాయితీ ప్రకారం నా అభిప్రాయం చివరగా చెబుతాను. ముందు దీన్ని Dissectionకి ఉపక్రమించండి అని ముగించాను.
“నా మట్టుకు నాకు ఇది అబ్సర్డ్ స్టోరీలా కనిపిస్తోంది. లీజా రాబర్ట్స్ ని ప్రేమించి పెళ్ళిచేసుకుంది. అలాంటప్పుడు రాబర్ట్స్ చనిపోతే అతనిగురించి ఏడవకుండా, తను పోలీసులకు లొంగిపోకుండా, చేసిన తప్పు కప్పిపుచ్చుకుందికి లీజా ప్రయత్నించడం అసందర్భంగాతోస్తోంది” అన్నాడు సుబ్రహ్మణ్యం.
“మొగుడు తనని ప్రేమించకపోయినా, పెళ్ళిచేసుకున్న నేరానికి స్త్రీ అదే మగాడికి, ఆ బంధానికీ కట్టుబడి ఉండాలన్న బానిసత్వభావన నుండి బయటపడమని చెప్పడానికీ, సందర్భం వచ్చినపుడు స్త్రీ ఎలా ప్రవర్తించాలో, తనుచిక్కుకున్న ఉచ్చులోంచి ఎలా బయటపడాలో పరోక్షంగా నిర్దేశిస్తూ రాసిన good women’s lib రచన ఇది” అన్నారు లక్ష్మి గారు తమ సహజ ధోరణిలో.
“ఇందులో నేరపరిశోధన కూలంకషంగా చేసినట్టు తోచదు. రాబర్ట్స్ ఎప్పుడు చనిపోయాడు? అప్పుడు లీజా ఎక్కడ ఉంది? ఇంట్లోకి ఎవ్వరైనా వచ్చేరా? వాళ్ళగుర్తులూ, వేలి ముద్రలూ గురించి ఎక్కడా చెప్పలేదు. Structural గా ఈ కథలో లోపం ఉంది” అన్నారు స్వామి.
మిగతా వాళ్ళు “చెప్పడానికి ఏమీ లేదు” అనడంతో నా అభిప్రాయం చెప్పడం ప్రారంభించేను.
“మొదటగా స్వామిగారి అభ్యంతరం. ఈ కథ నేను మీకు టూకీగా చెప్పేను. కథాగమనాన్నికుంటుపరిచే అనవసరమైన వివరాలు నేను చెప్పలేదు. కథకుడూ చెప్పలేదు. దానికి కారణం, రచయితకి, పాఠకుడికి తన సామర్ధ్యం మీద అంత అపనమ్మకం ఉండకపోవచ్చుననే నమ్మకం. లీజ సృష్టించుకున్న alibi వల్ల ఆమెను అనుమానించడానికిగాని, ఒక వేళ అనుమానించినా నేరంలో ఉపయోగించబడినదని భావిస్తున్న పరికరాన్నిగుర్తించలేకపోవడం ఆమెను దోషిగా నిర్థారించడానికి ఆస్కారం కలిగించడం లేదు… నిజానికి ఆ వస్తువు దొరకకుండా చెయ్యగలగడంలోనే ఈ కథలోని నాచురాలిటీ ఉంది. నిజానికి ఇందులోని నేరం ముందుగా వేసిన ప్రణాళిక ప్రకారం చేసినది కాదు. అది యాదృఛ్ఛికం.
“ఇక లక్ష్మిగారి అభ్యంతరం. ఆమె చెప్పినట్టు ఇది women’s lib కథ కాదు. ఎందుకంటే ఆ సమాజంలో స్త్రీకి వ్యక్తి స్వేఛ్ఛ ఇంతకు ముందే ఉంది. లీజ కట్టుబడిఉన్నది వివాహబంధానికి కాదు. తన ప్రేమ బంధానికి. అందుకనే తన భర్త ఎన్నటికైనా మారతాడేమోనని ఎదురుచూసింది. ఈ బంధం తనకు తానై వేసుకున్నది.
“ఇక పోతే సుబ్రహ్మణ్యంగారు చెప్పినట్టు ఇది అబ్సర్డ్ కూడ కాదు. రాబర్ట్స్ మరణం ఒక Accident. తను కోరుండి చంపలేదు. తనని నిర్లక్ష్యం చేస్తున్నప్పటికీ, అతనిలో మార్పుకోసం ఆమె నిరీక్షించ ప్రయత్నించడమే దానికి తార్కాణం. ఒక స్త్రీ తనకిష్టమయిన పురుషుడికోసం గాని, ఒక పురుషుడు తనకిష్టమయిన స్త్రీకోసం గాని ఎందుకు పరితపిస్తారో చెప్పడం కష్టం. అది పూర్తిగా వైయక్తికం. నా స్నేహితురాలి విషయంలోకూడా అదే జరిగింది. తన భర్త తనని ఎన్నిచిత్రహింసలు పెట్టినా వేరుగా ఉంది గాని, ఒకరిద్దరు ముందుకు వచ్చినా మళ్ళీ పెళ్ళిచేసుకోలేదు. ఇంకో వ్యక్తికి ఆశ్రయం ఇవ్వలేదు. ఒకరు ఇంకొక వ్యక్తిలోని మార్పుకోసం ఎదురుచూస్తున్నారంటే, ఆ రెండో వ్యక్తిలో కొంత మంచీ, కొంత ఆకర్షణా ఉన్నాయనీ, దూరంగా ఉండడానికి ఏవైతే ప్రేరకాలో అవి తాత్కాలికమైనవనీ, మార్పురావడానికి అవకాశమున్నట్టు మొదటి వ్యక్తి గుర్తించడంగాని, ఆశించడంగాని చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. Loyalty అన్నది ప్రేమలా primary or elementary passion కాదు. అది వ్యక్తిగతమైన ఎంపిక. A Personal choice. A civilized choice.
”అయితే నా దృష్టిలో ఈ కథని చూడవలసిన తీరు వేరు. ఒక ప్రమాదం జరిగింది. అది మన చేతులలో లేదు. ఇపుడు తక్షణ కర్తవ్యం అందులోనుండి బయటపడడమే. రాబర్ట్స్ ని లీజా ప్రేమించినా, అక్కడ తక్షణకర్తవ్యం తను అందులోనుండి బయటపడడమేనని తను భావించింది. ప్రాణంపోయిన తర్వాత ఎంత ప్రీతిపాత్రమైన వ్యక్తిదయినా, శరీరాన్ని దహనమో ఖననమో చేసినట్టే, రాబర్ట్స్ ప్రమాదవశాత్తూ చనిపోవడంతో ఆమె ప్రేమకి ఆలంబన పోయింది. ఇక తన జీవితాన్ని దిద్దుకోవడం, తను ప్రమాదవశాత్తూ చిక్కుకున్న పరిస్థితులలోనుండి బయటపడడం లీజాకు ముఖ్యమని తోచింది. ఆమె pragmatic అని అతి తక్కువసమయంలో అమలుపరిచిన ఆమె పథకమే చెబుతోంది. కొసమెరుపు ఆ సునిశితమైన వస్తువు ఎట్టిపరిస్థితుల్లోనూ దొరకకుండా చెయ్యగలగడం లోని నేర్పు.”
మరి మీరేమంటారు?
NS Murty
13.1.1995
చాలా బాగుంది. హత్య అనుకోకుండా జరిగిన సంఘటన, తను చిక్కులో పడకుండా తప్పించుకోడం కోసం చేసినపని సర్వసహజం. పోలీస్ తెలుసుకోలేకపోవడం వాళ్ళ అసమర్ధతే.
శర్మగారూ,
మీరు కథ చదివి అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీ బ్లాగు నేను ఫాలో అవుతున్నా. సమకాలీన సమస్యలను మీదయిన రీతిలో ప్రస్తావిస్తున్నారు.
అభివాదములతో