(ఇది కీర్తిశేషులు రావి శ్రీకృష్ణ మూర్తి గారు వ్రాసిన అముద్రిత కథలలో ఒకటి. ఇది అప్పటికింకా ప్రైవేటైజేషను అమలుకాని రోజుల్లో వ్రాసింది.)
అంబాసిడరు కారు సర్రునవచ్చి హోటల్ హెరిటేజ్ పోర్టికోలో ఆగింది. ఒక్కసారిగా వేసిన బ్రేకుకి షాక్ ఎబ్జార్బర్లు కారుని స్వింగ్ చేసి ఊయలఊపినట్టు ఆగింది కారు. డ్రైవరు దిగి వెనకతలుపు తెరిచి వినయంగా నిలుచున్నాడు.
విమల సుతారంగా కారులోంచి దిగింది.
విమలకివాళ ఎంతో గర్వంగా ఉంది. ఎందుకో చెప్పలేనంత హాయిగా ఉంది. ముందడుగువేస్తున్న మహిళాలోకంలో ప్రగతికి ప్రతీక విమల. ఇంతవరకూ మగవారికే పరిమితమైన ఈ ప్రొఫెషన్లోకి అడుగుపెట్టిన తొలి మహిళ విమల. తలుచుకుంటే, స్త్రీజాతి ఎదగలేని ఎత్తులు లేవు. అందుకే విమలకి ఎంతో గర్వంగా ఉంది.
ద మోస్ట్ ప్రిస్టీజియస్ సెమినార్ అండ్ కన్వెన్షన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్! ఎంతో మంది సీనియర్ మెంబర్స్ ఆఫ్ ద ప్రొఫెషన్ పార్టిసిపేట్ చేస్తున్నఇంతటి ప్రముఖమైన కన్వెన్షన్ కి ఎందరో ప్రొఫెషనల్ విజార్డ్స్ ఉన్న మల్టీనేషనల్ కంపెనీలో, మన్నికైన ఎన్నికై, తన కంపెనీకి ప్రాతినిధ్యం వహించమని నియమింపబడడం ఏం తక్కువ గౌరవమా? స్త్రీజాతికి కూడా ప్రతినిధిగా నిలిచిన విమలకి గర్వకారణం కాదూ మరి?
రిసెప్షన్ కౌంటరు దగ్గర కూర్చున్న ఇద్దరు అందమైన అమ్మాయిలు నవ్వుతూ విష్ చేసేరు. ఒకామె తనపేరు చెప్పగానే ఆమెకోసం ముందుగానే రిజర్వుచెయ్యబడ్డ గదితాళాలు అందించింది. సెమినార్ ట్వెంటీఫస్ట్ ఫ్లోర్లో బేంక్వెట్ హాల్ లో అని చెప్పి ఎలా వెళ్ళాలో కూడా చెప్పింది.
“థాంక్యూ!” అని చాలా సివిలైజ్డ్ గా పలికి అక్కడనుండి కదిలింది.
అద్దాల బీరువాలో అందాల బొమ్మలలా అలంకారప్రాయంగా కూర్చున్న రిసెప్షనిస్టులని చూసేక మరింత గర్వంగావుంది విమలకి. “ఆటబొమ్మలుగానూ, అలంకరణలుగానూ, షో పీసులుగానూ, విలాస వస్తువులుగానూ స్త్రీలు నిలిచే రోజులు పోయాయమ్మా. కళ్ళుతెరిచి చూడండి. పదండి ముందుకు” అని చెప్పాలనిపించింది వాళ్ళతో. ఆడవారిని ఇలాచేసిపారేసిన మేల్ ట్రెయిటర్స్ ని ఎదిరించి “ఇంకానా? ఇకపై సాగదు!” అని ఎదిరించమని ఉద్భోధించాలనిపించింది ఆమెకి.
ఈనాటి మహిళ ఏ రంగంలోనూ మగాడికి తీసిపోదు. ఎంతో జాగృతమై ముందడుగు వేస్తోంది. ఉదాహరణకి తను చాలదూ?
రూం లోకి వెళ్ళిన తర్వాత ఎటాచీ తెరిచి బట్టలు మార్చుకుంది. తయారై , రూం కి తాళం వేసి బేంక్వెట్ హాల్ వైపు నడిచింది.
బేంక్వెట్ హాలు హోటల్ హెరిటేజ్ “హెరిటేజ్“కి తగ్గట్టుగా వుంది. అర్థచంద్రాకారంలో అమర్చబడిన కుర్చీలూ, చుక్కలలోచంద్రుడిలా మధ్యలో అమర్చబడిన ఎత్తైన మండపం, దానిపైన పొడవైన టేబిల్స్, తెల్లదనంలో మల్లెపూలతో పోటీపడే టేబిలుక్లాతూ, ముఖ్య అతిథిదీ, మిగిలిన అతిథులవీ, ఉపన్యాసకులవీ పేర్లు విడివిడి అక్షరాలతో గుచ్చబడిన నేం ప్లేట్లూ, మధ్యలో పెద్దఫ్లవర్ వేజ్ లలో నిండుగా పలురంగుల గులాబీలూ ఉన్నాయి. కుషన్ కుర్చీల వెనుకగా గోడమీద నీలిరంగు గుడ్డమీద బంగారం, తెలుపూ, ఎరుపూ రంగులతో పెయింట్ చేసివున్న బేనరూ ఆనాటి కార్యక్రమ విభవం చాటుతున్నాయి.
ప్రతికుర్చీదగ్గరా ఒక మినరల్ వాటర్ బాటిలూ, ఒక గాజుగ్లాసూ, దానిమీద మూతా, ఇన్స్టిట్యూట్ స్థాయిని గుర్తుచేస్తున్నాయి. డయాస్ కి ఒక ప్రక్కగా స్పీకర్స్ డెస్క్, మూడు మైక్రోఫోనులూ తమ విధినిర్వహణకు సంసిధ్ధంగా నిలబడి ఉన్నాయి. హాలంతా కన్సీల్డ్ లైటింగూ, అందమైన ప్లాస్టర్ ఆఫ్ పేరిస్ తో మలచబడిన సీలింగ్, ఎక్కడినుండివస్తున్నదోతెలియకుండా మంద్రస్థాయిలో మధురమైన వాద్యసంగీతం, చక్కని పర్ఫ్యూం రూం ఫ్రెష్నర్ తో కలిసి ఆ పూర్తి వాతానుకూలిత వాతావరణంలో ఇరవై ఒకటవ అంతస్థులో అంతా మరో మధురమైన ప్రపంచంలా, కలలా గోచరిస్తోంది. ఆవాతావరణం భారతదేశపు వాతావరణం కాదు. బాగా ప్రగతి సాధించిన వెస్టర్న్ వరల్డ్ లా ఉంది. భారతదేశం మున్ముందు సాధించబోయే ప్రగతికి “మోడల్“లా, ధరించబోయే నూతన అవతారంలా ఉంది.
“ప్లీజ్ కం హియర్ మాడం!” ఒక వలంటీర్ బాడ్జి పిలిపు.
డయాస్ కి కుడివైపుగా రెండు టేబిల్సు మీద మేలురకం ప్లాస్టిక్ ఫోల్డర్లూ, మెమెంటోలూ ఉన్నాయి. ఒక టేబిలుమీద “రిసెప్షన్” అని చిన్నబోర్డూ, దానిప్రక్కనే ఫిక్సోగ్రాఫ్ బోర్డుమీద చిన్నచిన్నకన్నాలలో గుచ్చబడిన సుందరమైన తెల్లని అక్షరాలు చెబుతున్న కార్యక్రమవివరణా కనిపించేయి విమలకి. టైం చూసుకుంది. కార్యక్రమం మొదలు కావటానికి ఇంకా పదినిముషాలు వుంది.
“అయాం విమలా, మిస్ విమలా” అంది “మిస్“ని వత్తి పలుకుతూ.
“వెల్ కం మిస్ విమలా… మిమ్మల్ని మిస్ కానందుకు సంతోషంగా ఉంది“అని మిస్చువస్ గా నవ్వుతూ చమత్కరించేడు టేబిలువెనుక సూట్ వేసుకుని కూర్చున్న యువ కార్యకర్త. నవ్వింది విమల.
రిజిస్ట్రేషన్ అయ్యేక, కాన్ఫరెన్సుమెటీరియల్ తో పాటు, ఒక రైటింగ్ పేడ్, ఒక హైటెక్ పెన్నూ, పొందికగా అమర్చబడిన ఒక ప్లాస్టిక్ ఫోల్డరూ అందించేడు ప్రక్కనున్నమరో వలంటీరు. దానితోబాటు ఒక ప్లాస్టిక్ కవరుమీద “సెమినార్ కి హాజరయే గౌరవనీయమైన డెలిగేట్లకి ఫలానా కంపెనీ తరఫున చిరుకానుక” అని రాసిఉన్న గిఫ్ట్ కూడ అందించేడు.
“థాంక్యూ!” అని అక్కడనుండి కదిలింది. ఒక మంచి జాగా చూసుకుని కూర్చుంది.
కార్యక్రమంమొదలయిన దగ్గరనుండి విమల చాలా ఉత్సాహంగా చర్చలలో పాల్గొంది. చర్చకువచ్చిన ప్రతివిషయంమీదా చక్కగా విశ్లేషించి, తన దృక్పథాన్ని వివరించి, అందరి మన్ననలనూ పొందింది. ఆఖరున ముఖ్య అతిఠి మాట్లాడుతూ ప్రత్యేకించి విమలగురించి ప్రస్తావించేడు.
“మనదేశంలో స్త్రీలు వెనుకబడి ఉన్నారంటారంతా. చూడండి. ఈ మహిళ మన స్త్రీల పురోగమనానికి ప్రతిరూపం. ఆమె వెలిబుచ్చిన అభిప్రాయాలు ఈ వృత్తి పరిథిలోనికి వచ్చిన తొలి మహిళ అభిప్రాయాలుగా లేవు. చాలా పరిణతిచెందిన నిష్ణాతురాలి అభిప్రాయాలు అవి. ప్రజ్ఞావంతులసరసన నిలబడగలిగిన స్థాయిలో ఉన్నాయని చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను” అన్నాడు.
విమల సంతోషంతో పొంగిపోయింది. ప్రత్యేకించి ఆమెకు మరొక జ్ఞాపికకూడ బహూకరించేరు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమం, రాత్రి కన్వెన్షన్ డిన్నర్ కి తప్పక హాజరు కావలసిందన్న కర్యకర్తల పునరాహ్వానంతో ముగిసింది ఆరోజు సభ.
ఉల్లాసంగా తన రూం కి తిరిగివెళుతూఉంటే తోటివారంతా ఆమె విజ్ఞానాన్ని మెచ్చుకుంటూనే ఉన్నారు. సాయంత్రం సాంస్కృతికకార్యక్రమానికి తప్పకుండా హాజరయింది. ముందువరుసలో కూర్చునిఉన్న ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడులేచి తనకి కుర్చీ ఆఫరు చేసేడు. కార్యక్రమం అవుతున్నంతసేపూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు ఆమెతో. తర్వాత డిన్నరుకి ఎస్కార్టుచేశాడు.
అది “వెట్” డిన్నరు.
“ఇక్కడ అందరూ ఆల్కహాల్ తీసుకుంటారు. అలాగని మీరు భయపడనవసరం లేదు. వుయ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ!” అన్నాడు.
అందరూ విస్కీ గ్లాసులతో తిరుగుతూ ఉంటే, విమల సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటూ నలుగురితో పరిచయం ఏర్పరుచుకుంటూ కొంతసేపు గడిపింది. రెండుపెగ్గులుపూర్తిచేసి మూడోపెగ్గు చేతులోపట్టుకుని ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంటు ఆమెను వెతుక్కుంటూ వచ్చేడు.
“హల్లో విమ్లా! మీరిక్కడా వున్నారా? మీగురించి నేను హాలంతా వెతుకుతున్నాను,” అన్నాడు.
అతని మాటలు మందు నిషాతో ముద్దగా ఉన్నాయి. విమల ధైర్యంగా నవ్వుతూ, “చెప్పండి, వ్హాట్ కెన్ ఐ డూ ఫర్ యూ?” అంది.
వేడివేడి భోజనపదార్థాలన్నీ టేబిల్స్ మీద సిధ్ధంగా అమర్చబడి ఉన్నాయి. వాటిని చూపిస్తూ, “చూడండి! ఈ భోజనపదార్థాలన్నీ తెల్లటిదుప్పటిపరచిన ప్రక్కమీద ఆరగింపమంటూ ఎదురుచూస్తున్న సుందరాంగిలా లేవూ?” అనడిగేడు.
ఇబ్బందిగాచూసి, మాట్లాడకుండా అక్కడనుండి కదిలింది విమల. మరొక పెద్దమనిషి అదే స్థితిలో ఉన్నవాడు ఎదురుపడ్డాడు.
“విమ్లగారూ! ఆడవాళ్ళలో, అయితే అందమైనాఉంటుంది, లేకపోతే తెలివైనాఉంటుంది. అందంఉంటే తెలివుండదు —తెలివుంటే అందముండదు. ఆకారం వికారంగాఉంటేనేగాని, బుధ్ధి సురేకారంలా పనిచేయదట. మరి మీలో రెండూ ఉన్నాయి. యూ ఆరే లవ్లీ బ్లెండ్!” అన్నాడు “బ్లెండ్“ని “బెండ్” గా ఉఛ్ఛరిస్తూ.
విమల ఏం మాట్లాడలేదు. ఆమెకు ఈ కంపెనీ ఏమాత్రం నచ్చడం లేదు.
”అందం, విజ్ఞానం ఉన్న ఆటబొమ్మ!” అన్నారెవరో.
ఎవరైనా తనకి ఆసరాఇస్తారేమోనని అటూఇటూ చూసింది. అందరూ చేతులలో గ్లాసులతో ఈసన్నివేశాన్ని ఇంకా ఆనందిస్తున్నట్టుగా ఉన్నారు. గబగబ ఒకప్లేటుతీసుకుని డైనింగుటేబిలువైపు నడిచింది.
“నో! నో!! నో!!! మేడం! అంత వేగం కుదరదు. యూ ఆర్ అవర్ ఆర్నమెంట్. ఆఖరు వరకూ ఆగాలి!” అన్నాడు నిషాలో ఉన్న ఒక వ్యక్తి.
విమలకి ఒక్కసారిగా కోపం పెల్లుబికింది.
“కాస్త మర్యాదగా మాట్లాడండి. స్త్రీ అంటే ఆటబొమ్మాకాదు, విలాసవస్తువూ, అలంకరణా అంతకంటే కాదు. మీ అందరికంటె తెలివైనదే. గుర్తుంచుకోండి.” గట్టిగా అరిచింది.
స్త్రీని చులకనిచేసి మాట్లాడే ఈ మేల్ డెవిల్స్ ని ఆమె స్పేర్ చెయ్యలేదు.
“హియర్! హియర్! బాగుంది. బాగుంది. అయ్ లైకిట్! వన్స్ మోర్!”అంటూ ముందుకివచ్చి విమలభుజంమీద చెయ్యివేసేడు ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్. అందరివైపుకి తిరిగి, “జెంటిల్మెన్! బిహేవ్ యువర్ జెల్వ్జ్. మనమధ్యలో ఒక మహిళామణి ఉందని మరిచిపోకండి ” అన్నాడు మత్తుగా.
“మరిచిపోం. మరిచిపోం. మణిలాంటి మహిళ. మహిళామణి! మరిచిపోం“
“ఆమెగారు అందరిదీను. నీ సొమ్మయినట్లు మాట్లాడుతున్నావ్!” వెనకనించి బాగాకిక్కెక్కినవాడెవడో అరిచేడు.
“యస్! యూ ఆర్ రైట్! రైట్ యూ ఆర్! మిస్ విమ్లా! ఈ బ్లోక్స్ తో మనకెందుకు? పద. లెట్స్ గో!” అన్నాడు ప్రెసిడెంటు ఆమె చెయ్యి పుచ్చుకుని.
కోపంతో చెయ్యి విదిలించుకుని, చేతిలోఉన్న ప్లేటు అక్కడే పడేసి, బయటకి నడిచింది విమల. వెనకాలే అతనూ మిగతావారికి బై బై చెప్పేస్తూ, “కోపమొచ్చిందా లవ్లీ గర్ల్?” అంటూ రెండుచేతులతోనూ ఆమెను ఆపేడు. విమల మరింక సహించలేకపోయింది.
ఆచిపెట్టి శక్తికొద్దీ అతనిచెంపమీద ఛెళ్ళుమని కొట్టింది. గబగబ బయటకు నడుస్తూ, గాంధీ మహాత్ముడు అన్నమాట జ్ఞప్తికి తెచ్చుకుంది…
ప్రగతి పథంలో పయనిస్తున్న భారతనారి విమలకి ఇపుడు ఏమాత్రం గర్వంగా లేదు.
***